IPL 2026: టీ20 ప్రపంచకప్ 2026 ముగిసింది. ఫైనల్లో న్యూజిలాండ్ పై 96 పరుగుల తేడాతో గెలిచి టీమిండియా మూడోసారి విశ్వ విజేతగా నిలిచింది. ప్రపంచకప్ ముగియడంతో దేశంలో క్రికెట్ ఫీవర్ కొంచెం తగ్గిపోయింది. కానీ మరో 18 రోజుల్లోనే మళ్లీ క్రికెట్ సందడి స్టార్ట్ కానుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనా ఇండియన్ ప్రీమియల్ లీగ్ (ఐపీఎల్) 2026 మార్చి 28వ తేదీన ఆరంభం కానుంది. మార్చి 28 నుంచి మే 31వ తేదీ వరకు ఈ క్యాచ్ రిచ్ లీగ్ టోర్నమెంట్ జరగనుంది. 10 జట్లతో రెండు నెలల పాటు దేశంలో క్రికెట్ హంగామా కొనసాగనుంది. దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీలు ఈ టోర్నీలో బరిలోకి దిగనుండటంతో పాటు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్‌లు కూడా ఐపీఎల్ ఆడబోతున్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగబోతుంది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు విషయానికి వస్తే గత రెండేళ్లలో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. గతంలో తెలుగు రాష్ట్రాల క్రికెట్ ఫ్యాన్స్ ఇతర టీమ్స్ కి సపోర్ట్ చేసేవారు.. కానీ 2024 నుంచి హైదరాబాద్‌కి మద్దతు ఇవ్వడం మొదలు పెట్టారు. దానికి కారణం బ్యాటింగ్‌లో దూకుడు. 2024లో ఎవరి ఊహించని విధంగా సన్ రైజర్స్ బ్యాటింగ్ చేయడమే.. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్‌లు చెలరేగిపోయారు. ఇక 2025లో వీరికి ఇషాన్ కిషన్ కూడా జత కలవడంతో పాటు మిస్టర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ని సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ బాగా ఇష్టపడుతున్నారు. దీంతో సన్ రైజర్స్ జట్టుకి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది.
గత సీజన్ తొలి మ్యాచ్‌లోనే సెంచరీ కొట్టిన ఇషాన్ కిషన్.. ఆ తర్వాత ఫెయిల్ అయ్యాడు. అయితే ఇప్పుడు అద్భుతమైన ఫామ్‌లోనే ఉన్నాడు. భారత్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2026కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుని గాయాలు వెంటాడుతున్నాయి. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెన్ను గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. దాంతో అతడు ప్రపంచకప్ కూడా ఆడలేదు. దీంతో ఐపీఎల్ 2026 ఆరంభమయ్యేలోపు అతడు పూర్తిగా కోలుకుంటే కెప్టెన్ గా కొనసాగుతాడు.. లేకపోతే మాత్రం కొత్త సారథి సన్ రైజర్స్ హైదరాబాద్‌ను లీడ్ చేసే ఛాన్స్ ఉంది.
కాగా SRH కెప్టెన్సీ పగ్గాల అందుకునేందుకు ముగ్గురు ఆటగాళ్లు రేసులో ఉన్నారు. హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్‌లు ముందు వరుసలో కొనసాగుతున్నారు. గాయం కారణంగా ఐపీఎల్ 2026కు ప్యాట్ కమిన్స్ దూరమైతే.. ఈ ముగ్గురిలో ఒకరు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉంది. గతేడాది ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఇషాన్ కిషన్ ట్రోఫీని అందించాడు. 2016లో జరిగిన అండర్–19 ప్రపంచకప్‌లో భారత కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉంది. అప్పుడు టీమిండియాను విశ్వవిజేతగా నిలబెట్టాడు. కమిన్స్ ఐపీఎల్ కి ఒకవేళా దూరమైతే సన్ రైజర్స్ జట్టుకి కెప్టెన్ గా ఇషాన్ కిషన్ కరెక్ట్ అని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.
